మాది చేనేతల, చేతల సర్కారు : కేటీఆర్

వాస్తవం ప్రతినిధి: మాది చేనేతల, చేతల సర్కారు అని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇవాళ శాసనమండలిలో చేనేత రుణాలు-హ్యాండ్‌లూమ్ రంగానికి సహాయం అనే అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ చేనేత రంగంలో చూసినా మనవారే ఉన్నారన్నారు. వ్యవసాయం తర్వాత తెలంగాణలో కీలక రంగం చేనేత రంగమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత పనిచేస్తున్న వారి లెక్కలే లేవన్నారు. 2002లో చాలా మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2007లో సిరిసిల్లలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు.

తెలంగాణలో ఉన్న మగ్గాలకు జియో ట్యాగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చేనేత రుణమాఫీని పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సారి కూడా బతుకమ్మ చీరలు సిరిసిల్లలో తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సూరత్ నుంచి వచ్చిన చీరల్లో కొన్ని నాసిరకం వచ్చాయని, చేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. సినీ నటి సమంత ఉచితంగా చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు తెలంగాణ సర్కార్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు .