జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ : కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,75,534లుగా ఉందని సీఎం వెల్లడించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. 2013-14లో దేశ జీడీపీ వృద్ధి రేటు 13 శాతంగా ఉందని సీఎం తెలిపారు. అదే సమయంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 12.4 శాతంగా ఉందన్నారు. 2017-18లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.8 శాతంగా ఉందన్నారు. 2017-18లో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 14.81 శాతంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
2013-14లో వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 4 శాతంగా ఉంది. 2017-18 నాటికి వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 7 శాతంగా ఉంది. 2013-14లో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిరేటు -0.8 శాతంగా ఉంది. 2017-18లో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5 శాతంగా ఉందని తెలిపారు.

కళ్యాణలక్ష్మి పథకం అద్భుతం
ఒక మంచి పథకం పెట్టాలంటే ఎన్నో తర్జన భర్జనలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఒక రకమైన అనిశ్చితిలో ఉన్నామని తెలిపారు. అనిశ్చితి సమయంలోనే కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఈ పథకం కింద రూ. 51 వేలు ఇస్తామంటే పలువురు విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకం అద్భుతమని సీఎం ఉద్ఘాటించారు. తెలంగాణ ముద్దుబిడ్డ జీఆర్ రెడ్డి అందించి సేవలు మరువలేనివి అని ప్రశసించారు.

ఫార్మాసిటీని అడ్డుకోవద్దు
19 వేల ఎకరాల్లో అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఫార్మాసిటీ ద్వారా వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఫార్మాసిటీని అడ్డుకోవద్దని ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నాను. ఫార్మాసిటీని అడ్డుకుంటే ఓట్లు రావు అని చెప్పారు.

దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ
దళితుల భూముల కోసం గత ప్రభుత్వాలు రూ. 92 కోట్లు ఖర్చు పెట్టాయి. తమ ప్రభుత్వంలో దళితుల భూముల కోసం ఇప్పటికే రూ. 556 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అర్హులైన వ్యవసాయ ఆధారిత దళితులకు మూడు ఎకరాలు ఇస్తున్నామని చెప్పారు. 13 వేల ఎకరాలను 5 వేల మంది దళిత కుటుంబాలకు ఇచ్చామని వెల్లడించారు. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుందన్నారు.