సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది: పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా జనసేన నిర్వహించతలపెట్టిన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదికపై చేరుకుని భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీ పెట్టానని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని అన్నారు.
ఏపీ యువత ప్రాణాలను నేను ఫణంగా పెట్టను. నా నేల కోసం మాతృభూమి కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. టీడీపీకి ప్రజల మీద నా అంతటి ప్రేమ ఉందా?.. జనం మీద సాటి మనుషుల బాధలకు చలించే పోయే గుణం చంద్రబాబుకి ఉందా? అసెంబ్లీలో కూర్చొని ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు.. భావోద్వేగ పూరితంగా మాట్లాడుతున్నారు.. గుంటూరులో కలరా వచ్చి అంతమంది చనిపోయే మీకు భావోద్వేగం కలగలేదా? శ్రీకాకుళంలో ప్రతి ఏడాది సుమారు 55 మంది శిశు మరణాలు సంభవిస్తున్నాయి ఏం జరుగుతుందో రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని పవన్ కల్యాణ్ చంద్రబాబుని విమర్శించారు.
ఏ పరిస్థితుల్లో నేను 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చాను. మీకు పదవులు అప్పజెప్పి మీ కాళ్లతో తొక్కించుకోవడానికా?.. మీతో, మీ పిల్లలతో తొక్కించుకోవడానికా? ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తోంటే కంచె చేను మేస్తోంటే కాపరి ఏం చేయగలడు అనే సామెత గుర్తొస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్ధృతంగా పోరాడాల్సి వస్తుంది. మేము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయం. అమరావతిలోనే, అమరావతి నుంచే దేశాన్ని ఆకర్షించేలా పోరాడతాం.అన్నారు.