రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు .. ఏర్పాట్లు పూర్తి

వాస్తవం ప్రతినిధి: పదో తరగతి వార్షిక పరీక్షలను ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తంగా 5,38,867 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 26 సమస్యాత్మక కేంద్రాలతోపాటు మరో 405 పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతాయని (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు), విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని కిషన్‌ సూచించారు. అయితే నిర్ణీత సమయం 9:30 గంటల తరువాత 5 నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులకు సూచనలు
– ముందు రోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి.
– రైటింగ్‌ప్యాడ్‌ తీసుకెళ్లాలి. సివిల్‌ డ్రెస్‌లోనే పరీక్షకు హాజరు కావాలి.
– సరిపడా పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు తీసుకెళ్లాలి.
– ఓఎంఆర్, మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌ తమదే అని ధ్రువీకరించుకున్న తర్వాతే పరీక్ష రాయాలి.
– ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థి హాల్‌టికెట్‌ నంబరు వేయాలి.
– అడిషనల్‌ ఆన్సర్‌ షీట్స్, గ్రాఫ్, బిట్‌ పేపర్లపై మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌ సీరియల్‌ నంబర్‌ రాయాలి. హాల్‌టికెట్‌ నంబర్‌ రాయొద్దు. అవి విడిపోకుండా గట్టిగా దారం కట్టాలి.
– సీసీఈ విధానం కాబట్టి ప్రశ్న అడిగిన తీరును అర్థం చేసుకుని జవాబులు రాయాలి.