రెండో సారి కూడా విజయం సాదించిన విద్యా దేవి భండారి

వాస్తవం ప్రతినిధి: నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి విద్యాదేవి భండారి విజయం సాధించారు. తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన ఆమె రెండో సారి కూడా అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఈ రెండోసారి కూడా ఆమె భారీ మెజారిటీతో గెలుపొందినట్లు తెలుస్తుంది. వామపక్ష కూటమి అభ్యర్థి భండారి తన ప్రత్యర్థి, నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) అభ్యర్థి కుమారి లక్ష్మీరాయ్‌పై 2/3వంతు కంటే అధిక మెజారిటీ సాధించి జయకేతనం ఎగురవేశారు. భండారికి 39,275ఓట్లు రాగా, లక్ష్మీరాయ్‌కి 11,730 ఓట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి నవరాజ్ మంగళవారం తెలిపారు. దీనితో రెండోసారి కూడా విద్యా దేవి నేపాల్ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు.