ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్న యువ క్రికెటర్

వాస్తవం ప్రతినిధి: ప్రతిభకు పేదరికం అడ్డుకాబోదని చండూరుకు చెందిన 25 ఏళ్ల యువకుడు మండల అంజి నిరూపిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అంజి ఉపాధికూలీ పనులకు వెళ్తూనే డిగ్రీ వరకు చదివాడు. మరోవైపు క్రికెట్‌ అంటే పిచ్చి. తీరిక దొరికిందంటే చాలు మైదానంలోకి అడుగుపెట్టాల్సిందే. కళాశాల స్థాయి నుంచి మొదలై ఇపుడు కార్పొరేట్‌ స్థాయితో పాటు టీపీఎల్‌ ఆటగాడి వరకు చేరింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణిస్తూ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌లు, సీరీస్‌లతో ఆల్‌రౌండర్‌ ప్రతిభను చాటుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్న అంజి హైదరాబాద్‌ స్థాయిలో జరిగే కార్పొరేటు, టీపీఎల్‌ వంటి వివిధ రకాల రాష్ట్ర, నగరస్థాయి టోర్నమెంట్లలో ప్రతిభ చాటుతున్నారు. ఓవైపు క్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తూనే ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కంపెనీలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ బతుకు పోరాటం చేస్తున్నారు. ఇప్పడి వరకు వివిధ స్థాయిల్లో 250 మ్యాచ్‌లకు పైగా ఆడిన అంజి వందకు పైగా బహుమతులు పొందారు. భవిష్యత్‌లో మంచి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నాడు