ప్రజల ప్రయోజనాలను కాలరాసేలా వ్యవహరిస్తున్నారు: కేవీపీ

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలను కాలరాసేలా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నంది అవార్డు స్ధాయి నటనతో ప్రజలను ఆకట్టుకుంటూ కన్నీరు పెట్టుకోగా.. మోదీ ఆస్కార్‌ స్ధాయి నటనతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతోందని నాలుగేళ్లుగా తెలియలేదా అని కేవీపీ ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగలేదని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతుంటే మాత్రం ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాదని తెలిసి నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు.