కేంద్రమంటే మాకేం భయంలేదు..మేమెవరికీ భయపడం: పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లో హామీ ఇచ్చి తప్పుతారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ రోజు గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేంద్రమంటే మాకేం భయంలేదు. మేమెవరికీ భయపడం. అమరావతిలోనే, అమరావతి నుంచే దేశాన్ని ఆకర్షించేలా పోరాడతా. జాతీయ రహదారులను దిగ్బంధించి మేం ఏంటో చూపిస్తాం అన్నారు. తెలుగువారు టంగుటూరి ప్ర‌కాశం వార‌సులని, వారికి ఎలాంటి భ‌యం లేదని అన్నారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని ఢిల్లీకి విన‌ప‌డేలా ప్ర‌శ్నిద్దామ‌ని వ్యాఖ్యానించారు.   నాలుగేళ్లుగా ప్రజలకు మీరు చేసిన అన్యాయం మమ్మల్ని రగిలిస్తోంది. వేధిస్తోంది. సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా రాదన్నారు. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మీరెలా మద్దతు పలికారు? విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భాజపా ప్రత్యేక హోదా ఇస్తాననలేదా? 1997లో కాకినాడలో ఒక సీటు రెండు రాష్ట్రాలు అని భాజపా చెప్పింది. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లో హామీ ఇచ్చి తప్పుతారా? మీర్చిన హామీలు నిలబెట్టుకోనప్పుడు.. మీ చట్టాలను మేమెందుకు పాటించాలి? కేంద్రం తన చేతలతో ఏపీని ఉద్యమ పథంలోకి నెట్టేసింది. రాజధాని లేకుండా తెలంగాణ నుంచి మమ్మల్ని నెట్టేశారు. మేం దిల్లీలో జంతర్‌ మంతర్‌లో పోరాటం చేయం.. ఏపీలోనే జాతీయ రహదారులపై చేస్తాం. కేంద్రం చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. అవినీతిపరులు, తప్పుచేసిన వారికి సీబీఐని వదులుతారని భయం ఉండొచ్చు.