హ్యాకర్ల చేతికి చిక్కిన ఇస్రో కీలక కంప్యూటర్!

వాస్తవం ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఓ కీలక కంప్యూటర్‌ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలుస్తుంది. భారత్‌, ఫ్రాన్స్‌లకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కంప్యూటర్‌ నుంచి ఇస్రో కమాండ్‌ రాకెట్‌ లాంఛర్‌ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారం వీరిచేతికి చిక్కిఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎక్స్‌ట్రీమ్‌ రాట్‌’ పేరుతో పిలిచే ఈ మాల్వేర్‌ను 2017 డిసెంబర్‌లో ఇస్రోలోని ఒక సర్వర్‌లో కనుగొన్నారు. దీనిని తొలగించేందుకు ఫ్రాన్స్‌కుచెందిన పరిశోధకుడు రోబర్ట్‌ బాప్టిస్ట్‌ను పిలిపించారు. కానీ ఈ మాల్‌వేర్‌ సర్వర్ల వ్యవస్థలోకి పూర్తిగా ప్రవేశించలేదని ఆయన తేల్చారు. ప్రస్తుతానికి ఆ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అంతరిక్షంలోని ఉపగ్రహాలను ట్రాక్‌ చేసే ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్‌ట్రాక్‌)లో దీనిని కనుగొన్నారు. ఇది ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలను పరిశీలించడానికి, రాకెట్ల ప్రయోగానికి ఉపయోగిస్తారు. దీనికి ఉపగ్రహాలను ప్రయోగించే సమయంలో రాకెట్లు విడిపోవడానికి ఉపయోగించే కంప్యూటర్‌ను దీనికి అనుసంధానిస్తుంటారు. శోధన్‌ సెర్చి ఇంజిన్‌ను ఉపయోగించినప్పుడు ఈ వైరస్‌ దాడిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.