మునుపటి ఫామ్ లోకొచ్చిన రైనా….ధోనీ ని అధిగమించాడు!

వాస్తవం ప్రతినిధి: చాలా రోజుల తరువాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన సురేశ్ రైనా తన మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 ట్రైసిరీస్‌లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో రైనా(27 15 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్) అలరించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 1,444 పరుగులతో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మహీని అధిగమించి రైనా(1451) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. టీమిండియా తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లీ(1,983) అగ్రస్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ(1,696) పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడు రైనానే కావడం విశేషం. 1500 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 75 పరుగుల దూరంలో ఉన్నాడు. ముక్కోణపు టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ఈ మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన రైనా 153 స్ట్రెక్ రేట్‌తో 89 పరుగులు చేశాడు. సఫారీలతో ఫైనల్ టీ20 మ్యాచ్‌లో 27 బంతుల్లో 43 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.