ముగ్గురు ప్రముఖుల కోసం బోయింగ్-777 విమానాలు సిద్ధం చేస్తున్న ఎయిరిండియా వన్

వాస్తవం ప్రతినిధి: భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు 2020 కల్లా సకల సదుపాయాలున్న ప్రత్యేక విమానాలు సిద్ధం కానున్నాయి. ఎయిర్ ఇండియా వన్ ఇప్పటికే కొత్త విమానాలకు మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయింది. ఈ ముగ్గురు వీవీఐపీలకు ఉద్దేశించిన బోయింగ్-777 విమానాల్లో అవసరమైన సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ విమానాలకు పలు విశిష్టతలు ఉన్నాయి. పలు సదుపాయాలతో పాటు అవసరమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు విమానాల్లోని రెండింటిలో వీఐపీ ఎన్‌క్లోజర్, మీడియా సమావేశ గది, వైద్య అత్యవసర పరిస్థితుల కోసం రోగి రవాణా యూనిట్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు వైఫై సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అదీకాకుండా ఇవి భారత్ నుంచి నేరుగా యుఎస్‌కు ఎక్కడా ఆగకుండా వెళ్లగలవు. ఇంధనం కోసం మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఎయిర్ ఇండియా మూడు బోయింగ్-777 విమానాలను ప్రవేశపెట్టింది. 2006లో 68 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో రెండు విమానాలను కేవలం వీవీఐపీల కోసమే కేటాయస్తారు.