ప్రతీకార దాడులకు దిగిన మావోలు….8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతం మరోసారి నెత్తురోడింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదను చూసి ప్రతీకార దాడులకు దిగారు. దీనితో సీఆర్పీ ఎఫ్ జవాన్లు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మంగళవారం వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 8 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ దాడిలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన అతిపెద్ద ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారిలో మావో ముఖ్యనేత తో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. అయితే ఇదే కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెందిన ఒక కానిస్టేబుల్ కు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి.