ఖలీదా జియా కు బెయిల్ మంజూరు

వాస్తవం ప్రతినిధి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. అనాధాశ్రమం కోసం ఉద్దేశించబడిన నిధులను దుర్వినియోగం చేసిన కేసులో దోషిగా తేలడం తో గత నెలలో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ దురుద్దేశంతో తనపై ఈ అభియోగాలు మోపారని ఆమె బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపేవరకు ఢాకాలోని ప్రత్యేక జైల్లో ఆమెను ఒంటరిగా వుంచారు. అయితే తాజాగా ఆమె బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లు ఆమె తరపు లాయర్ జైనుల్‌ అబెదిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు. నాలుగు మాసాల పాటు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించిందని, దీనితో ఆమె ఎప్పుడైనా జైలు నుంచి విడుదల కావచ్చని ఆయన అన్నారు. గత నెల 8న కోర్టు జియా కు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్‌ అంతటా ప్రధాన నగరాల్లో హింస తలెత్తింది. బిఎన్‌పి కార్యకర్తలు పోలీసులతో, పాలక పార్టీ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు.