ఉత్తర కొరియా పై ఒత్తిడి తేవడం లో చైనా పాత్ర చెప్పుకోదగ్గది!

వాస్తవం ప్రతినిధి: అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేలా ఉత్తర కొరియాపై ఒత్తిడి తెచ్చి ఒప్పించడంలో చైనా పాత్ర చెప్పుకోదగ్గదని దక్షిణ కొరియా జాతీయ భద్రతా డైరెక్టర్‌ చుంగ్‌ ఇయు యాంగ్‌ ప్రశంసించారు. మేలో చర్చలు జరిపేందుకు ట్రంప్‌, కిమ్‌లు అంగీకరించారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన సోమవారం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చైనా లో పర్యటిస్తున్న చుంగ్ చైనా విదేశాంగ విధాన సలహాదారు యాంగ్‌ జియిచితో కాసేపు చర్చలు జరిపిన అనంతరం అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, చైనా ప్రభుత్వ క్రియాశీల మద్దతుతోనే ఈ లక్ష్యం సాధించగలిగామని దక్షిణ కొరియా అభిప్రాయపడుతోందని చుంగ్‌ తెలిపారు. ఉత్తర కొరియా ఇక భవిష్యత్తులో ఎలాంటి అణు, క్షిపణి పరీక్షలను నిర్వహించబోదని కిమ్‌ ప్రతిన చేసినట్లు చుంగ్‌ తెలిపారు.