షమి కి నచ్చచెప్పాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా: హాసీన్

వాస్తవం ప్రతినిధి: భారత ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమిపై అతడి భార్య హసీన్‌ జహాన్‌ ఇటీవల సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అతడి పై విమర్శల దాడిని మరింత పెంచింది. తన భర్తతో సర్దుకుపోవడానికి ఎంతో ప్రయత్నించిన తాను.. అతడి తీరుతో విసిగి వేసారిపోయాకే బయటికి వచ్చి మాట్లాడాల్సి వచ్చిందని ఆమె అంది. షమి మొబైల్‌ తనకు దొరికి అతడి చీకటి వ్యవహారాలకు సంబంధించి సాక్ష్యాలు సేకరించడం వల్లే ఇప్పుడు తానిలా మాట్లాడగలుగుతున్నానని, లేదంటే తన పరిస్థితి దయనీయంగా ఉండేదని హసీన్‌ చెప్పింది. ‘‘షమికి సర్దిచెప్పడానికి ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను, అతను తన తప్పిదాన్ని ఒప్పుకుని ఉండాల్సింది. కానీ అతనలా చేయలేదు. షమిలో పశ్చాత్తాప భావమే లేదు. వివిధ దేశాల్లోని అనేకమంది మహిళలతో తన సంబంధాలు కొనసాగించాడు. నిజానికి షమి మొబైల్‌ నా చేతికి చిక్కకపోయి ఉంటే అతను ఉత్తర్‌ప్రదేశ్‌కు పారిపోయేవాడు. నా నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసేవాడు’’ అని కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో హసీన్‌ చెప్పింది. షమితో రాజీ చేసుకునే అవకాశం గురించి జహీన్‌ను ప్రశ్నించగా.. వ్యవహారం ఆ దశ దాటిపోయిందని చెప్పింది. ‘‘నా భర్తతో సర్దుకుపోవడానికి నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. నా లాయర్‌ సహాయకురాలు డోలా కూడా షమికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మేం ఆశించింది జరగలేదు. ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ దశలో రాజీ కష్టం. ఏదైనా నా లాయర్‌ సలహా మేరకే నడుచుకుంటా’’ అని ఆమె స్పష్టం చేసింది