ఉత్తర కొరియా పై ఎలాంటి అదనపు షరతులు లేవన్న అమెరికా

వాస్తవం ప్రతినిధి: ఉత్తర కొరియాపై ఎలాంటి అదనపు షరతులు లేవని అమెరికా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో తాను మే నెలలో చర్చలు జరిపేందుకు సిద్దమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య బలమైన చర్చలకు ముందడుగుపడటం, మున్ముందు ఇక అణు పరీక్షలు నిర్వహించబోమని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఎలాంటి షరతులు లేకుండానే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు అమెరికా వైట్‌ హౌస్‌ అధికారిక ప్రతినిధి రాజ్‌ షా ప్రకటించారు. ఈ సమావేశం ముఖ్య లక్ష్యం ఏమిటనేది దానిపై మా అధ్యక్షుడు ట్రంప్ కు చాలా స్పష్టత ఉంది. ఒత్తిడి చేయడమే మా లక్ష్యం. అంతేకాదు.. దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా నిర్వహించుకునే సైనిక విన్యాసాలపై కూడా ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు విసరకుండా, ప్రత్యక్ష విమర్శలు చేయకుండా ఉంటామని ఉత్తర కొరియా తమకు చెప్పినట్లు వెల్లడించారు.