అమరావతి సమీపంలో నూతన గృహానికి పవన్ శంకుస్థాపన

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని కాజ దగ్గర సొంతింటి నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంతో పాటు, సొంత ఇల్లు కూడా రాజధాని ప్రాంతంలో ఉంటే బాగుంటుందని జనసేనాని నిర్ణయించుకున్నారు. దీంతో మంగళగిరి మండలం కాజలో రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి నేడు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భార్య లెజెనోవాతో కలిసి పవన్ పూజలు నిర్వహించారు. ఆరు నెలల్లోగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. ఇక్కడే జనసేన కేంద్ర కార్యాలయం కూడా ఏర్పాటవుతుంది. ప్రజలకు మరింత చేరువకావడానికి సహకరిస్తుందని జనసేన కార్యకర్తలు పేర్కొంటున్నారు.
ఈ సందర్బంగా పవన్ కల్యాణ్, కొత్త ఇల్లు కట్టుకోవాలని భావించిన కారణాన్ని మీడియాకు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో కీలక సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో ఇంటి నిర్మాణాన్ని తలపెట్టానని అన్నారు. అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజలు తన వద్దకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెప్పారు. ఈ నెల 14 తరువాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిప్రాయాలను ఎన్నడూ దాచుకోబోనని, సమస్యలు ఎదురైతే పారిపోయే మనస్తత్వం తనది కాదని అన్నారు. జనసేన ఆవిర్భావ మహాసభ నాడు తన మనసులోని మాటలను చెబుతానని పవన్ వ్యాఖ్యానించారు .