మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జెసీ!

వాస్తవం ప్రతినిధి: ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే టీడీపీ పార్టీ నేత జెసి దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఓ టివి చానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న‌ ఆయనను టిడిపి, బిజెపి అనుబంధం గురించి ప్రశ్నించగా.. ”టిడిపి, బిజెపి అనుబంధం పవన్‌ కల్యాణ్‌, రేణూ దేశాయ్ల మధ్య ఉన్న అనుబంధం లాంటిది. వారు విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల భవిష్యత్‌ కోసం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. బిజెపితో టిడిపి అనుబంధం కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనం కోసమే” అని జెసి సమాధానం చెప్పారు. అయితే మోదీకి పార్లమెంట్‌లో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ ఏపి పట్ల కనికరం చూపించడం లేదని ఆయన అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంతో విభేదించిన టిడిపి నేతలు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి తమ కేంద్ర మంత్రి పదవులకు ఇటీవల రాజీనామా చేయడం వాటిని రాష్ట్రపతి ఆమోదించడం జరిగిన సంగతి తెలిసిందే. కాగా టిడిపి ఇంకా ఎన్‌డిఎ భాగస్వామిగానే కొనసాగుతోంది.