భారత్‌ రొయ్యలపై అమెరికాలో 3రెట్ల పన్ను

 వాస్తవం ప్రతినిధి: భారత మత్స్య పరిశ్రమకు అమెరికా ప్రభుత్వం కష్టాలను సృష్టించింది. భారత్‌ నుంచి ఎగుమతయ్యే రొయ్యలపై ఉన్న పన్నును మూడురెట్లు పెంచింది. ప్రస్తుతం 0.84శాతం పన్ను చెల్లిస్తుండగా దానిని 2.34శాతానికి పెంచింది. దీనిపై అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ (డీవోసీ)వివరణ ఇస్తూ 2016 ఫిబ్రవరి నుంచి 2017 జనవరి వరకు తాము భారత్‌ నుంచి వచ్చే ఉష్ణజలాల రొయ్యల దిగుమతిని పరిశీలించినట్లు పేర్కొంది. భారత్‌ నుంచి వచ్చే రొయ్యలను అమెరికాలో సాధారణ ధర కన్నా తక్కువకు విక్రయిస్తున్నట్లు తేలినట్లు పేర్కొంది. దీంతో వీటిని యాంటీ డంపింగ్‌ చట్టాలు వర్తింప జేసింది. ఫలితంగా వీటిపై పన్నును పెంచారు. ఈ మేరకు కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ సంస్థకు ఆదేశాలను జారీ చేసింది. దీనిపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని డీవోసీ పేర్కొంది.
ప్రస్తుతం పరిశీలన నిమిత్తం ఈ పన్నును విధించారు. ఈ నిర్ణయ ఫలితాలను పరిశీలించి తర్వాత పూర్తి స్థాయి పన్ను అమలు చేస్తారు. భారత్‌ నుంచి రాయితీపై రొయ్యలను భారీగా అమెరికాకు తరలిస్తున్నారని సెనెటర్లు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యలను సీఫుడ్‌ ఇంపోర్ట్‌ మానిటరింగ్‌ ప్రోగ్రాం కిందకు తీసుకురావాలని 12 మంది సెనేటర్లు కోరారు. దీంతో అమెరికా రొయ్యల పరిశ్రమ ప్రమాణాలను భారత్‌ ఎగుమతి దారులు అందుకోవాల్సి ఉంటుంది.