తెదేపా రాజ్యసభ అభ్యర్డులుగా సీ ఎం రమేష్,రవీంద్ర కుమార్

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. రెండు స్థానాలకు గాను సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సీఎం రమేష్‌ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, కనకమేడల రవీంద్రకుమార్‌ తెదేపా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ముందుగా సీఎం రమేష్‌తో పాటు వర్ల రామయ్య పేరు రాజ్యసభ రేసులో వినిపించినప్పటికీ ఉన్నట్టుండి అనూహ్య పరిస్థితుల మధ్య రవీంద్ర కుమార్ పేరు తెరపైకి వచ్చింది. దీనితో వీరిద్దరి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తుంది. రాయలసీమలో ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి టీజీ వెంకటేష్‌ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అనంతపురం నుంచి ఇద్దరు మంత్రివర్గంలోనూ, మరో ఇద్దరు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవుల్లోనూ ఉన్నారు. చిత్తూరు సీఎం సొంత జిల్లా. ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కడప తెదేపాకి కీలకం. ఈ దృష్ట్యా అక్కడి నుంచి ప్రస్తుతం రాజ్యసభకి ప్రాతినిథ్యం వహిస్తున్న సి.ఎం.రమేష్‌కి మరోసారి అవకాశమివ్వాలని చంద్రబాబు భావించారు. ఇటీవలి వరకు కేంద్రంలో సహాయమంత్రిగా వ్యవహరించిన సుజనాచౌదరికి రెండేళ్ల కిందట రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో తాజాగా సీఎం రమేష్‌కి కూడా అదే సూత్రం మేరకు రెండోసారి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం.