కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది: హరి బాబు

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఏపీ కి ఏమీ చేయలేదంటూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన భాజపా కోర్‌ కమిటీ సమావేశం లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. అలానే ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆంద్రప్రదేశ్‌కు కేంద్రం చేయాల్సిన సాయమంతా చేస్తోందని, అంతేకాకుండా విభజన చట్టంలోని పెండింగ్‌ హామీలను త్వరలోనే నెరవేరుస్తామని ఆయన వివరించారు. అలానే భాజపా రాష్ట్రాన్ని మోసం చేసిందని కొందరు విమర్శించడం దారుణమని హరిబాబు అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక్క జాతీయ సంస్థ కూడా లేదని..మూడేళ్లలో భాజపా ప్రభుత్వం 9 జాతీయ సంస్థలను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇంకా మూడు హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.