‘కిమ్‌ను కలిసి హ్యామ్‌బర్గర్‌ తింటా’: ట్రంప్‌

వాస్తవం ప్రతినిధి :ఉప్పు నిప్పుగా..పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే అమెరికా, ఉత్తరకొరియా మధ్య తొలిసారిగా చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అయినా ఇప్పటికీ కొన్ని ఆటంకాలు..అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ‘ఉత్తరకొరియాతో ఒప్పందానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది పూర్తయితే ప్రపంచానికి శుభపరిణామమే. సమ యం, స్థలం నిర్ధారణ కావాల్సి ఉంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

దక్షిణకొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్‌ యి యాంగ్‌తో చర్చల తర్వాత ఈ ప్రకటన రావడంతో అందరూ దీనిపై దృష్టిపెట్టారు. ట్రంప్‌-కిమ్‌ మధ్య మే నెలలో చారిత్రాత్మక శిఖరాగ్ర చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అమెరికా అధ్యక్షులెవరూ ఇలాంటి చొరవ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ట్రంప్‌ మాత్రం కిమ్‌తో కలిసి ‘హ్యామ్‌బర్గర్‌’ తినడానికి ఉత్సాహంగా ఉన్నట్లు ప్రకటించారు.