స్వచ్చంద మరణానికి అనుమతిచ్చిన సుప్రీం!

వాస్తవం ప్రతినిధి: చికిత్సకు అలవికాని వ్యాధులతో బాధపడుతున్న రోగులు స్వచ్ఛందంగా మరణించాలనుకోవడం వారికి గల ప్రాధమిక హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.  ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛంద మరణానికి అనుమతినిచ్చింది. అయితే ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన పలు మార్గదర్శక సూత్రాలను మాత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. గతేడాది అక్టోబరు 11న ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజాగా పై తీర్పు వెల్లడించింది. ఎవరెవరు ఈ స్వచ్ఛంద మరణా నకి అర్హులు, ఎవరికి అనుమతినివ్వాలి అనే విషయంపై కొన్ని నిబంధనలను రూపొందించింది. అయితే దీనిపై ఒక చట్టాన్ని తీసుకువచ్చే వరకు తాము జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు అమల్లో వుంటాయని సుప్రీం స్పష్టం చేసింది. నలుగురు న్యాయమూర్తులు విడివిడి అభిప్రా యాలు తెలిపినప్పటికీ తీర్పు మాత్రం ఏకాభి ప్రాయంతో ఇచ్చినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.