సిరియా లో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలి: ఐరాస

వాస్తవం ప్రతినిధి: సిరియాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలంటూ  తాజాగా ఐక్యరాజ్య సమితి మరోసారి డిమాండ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం 2401ని అమలు చేయాలని పిలుపిచ్చింది. ఇటీవల సిరియాలో నెలకొన్న దుర్బర పరిస్థితుల పట్ల భద్రతా మండలి సభ్యులు ఆందోళన వెలిబుచ్చడమే కాకుండా అక్కడ ఘర్షణల విరమణపై చర్చ జరగాలని కోరారు. ఇప్పటికే అక్కడ చోటుచేసుకుంటున్న వరుస దాడుల నేపధ్యంలో ఒక నెల రోజుల పాటు కాల్పులు విరమించాలని ఐరాస కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కాల్పుల విరమణ ను పూర్తిగా అమలు చేయాలని ఐరాస డిమాండ్ చేస్తుంది. జనాంతిక చర్చల అనంతరం భద్రతా మండలి అధ్యక్షుడు, ఐరాసలో డచ్‌ రాయబారి కరేల్‌ వన్‌ ఊస్టరామ్‌ మాట్లాడుతూ పై డిమాండ్‌ చేశారు. అంతకు మించి సమావేశం వివరాలు వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఏకగ్రీవంగా ఆమోదించిన 2401 తీర్మానాన్ని అమలు చేయడంలో జరిగిన వైఫల్యాన్ని చర్చించేందుకు తక్షణమే సమావేశం జరగాలని ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు కోరినట్లు తెలుస్తుంది.