నా భార్యకన్నా ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టం అంటున్న పాక్ వ్యక్తి

వాస్తవం ప్రతినిధి: భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ పై ఉన్న క్రేజ్ అంతో ఇంతో కాదు. అతడంటే ఏకంగా  పడి చచ్చేవాళ్లు చాలా మందే ఉన్నారు. సగటు భారతీయ క్రికెట్‌ అభిమాని ఎవరైనా ధోనీ శకాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు. అయితే పాకిస్థాన్ కి చెందిన ఒక వ్యక్తి ‘నా భార్య కంటే నాకు టీమిండియా క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టం’ అని అంటున్నాడు. ఇంతకీ ఎవరు అతడు అంటే మహమ్మద్ బషీర్. బషీర్‌ ఎవరు.. ధోనీ అంటే ఎందుకు అంత ఇష్టం, అతని కోసం ఏం చేశాడు అనే కదా మీ సందేహం.  భారత్‌-బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న ముక్కోణపు టోర్నీ చూసేందుకు బషీర్‌ ఇప్పుడు ఆతిథ్య లంకలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో విలేకర్ల కంటపడ్డాడు. తనకు ధోనీ అంటే ఎందుకు అంతిష్టమో వారికి వివరించేశాడు. ‘2011లో ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్ ‌మధ్య మొహాలీలో ఓ సెమీఫైనల్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు నేను పాకిస్థాన్‌ నుంచి రెండు మూడు రోజులు ముందుగానే వచ్చాను. టిక్కెట్‌ కోసమని మైదానం వద్దకు వెళ్లగా అప్పటికే టిక్కెట్లు అయిపోయినట్లు బోర్డులు కనిపించాయి. దీంతో నేను తీవ్ర నిరాశ చెందాను. తిరిగి వెళ్లిపోదామని అనుకున్న నాలో మ్యాచ్‌ ఎలాగైనా చూడాలన్న బలమైన కోరిక అలాగే ఉండటంతో మరొక్కసారి ప్రయత్నించడంలో తప్పు లేదనుకున్నాను. అందుకే తర్వాతి రోజు మరోసారి స్టేడియానికి వచ్చాను. అయినా నిరాశ తప్పలేదు. దీంతో అక్కడే దిగాలుగా కూర్చున్నాను. ఇంతలో ఒక వ్యక్తి ఏదో కవరు చేతపట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఆ కవర్‌ను నాకు ఇచ్చాడు. అందులో ఏముందా అని తెరిచి చూశాను. నా కళ్లను నేనే నమ్మకలేకపోయాను. ఇంతకీ అందులో ఏమున్నాయో తెలుసా.. మ్యాచ్‌ టిక్కెట్లు. నిజంగా. నమ్మండి. ఎవరు పంపించారో తెలుసా మహేంద్ర సింగ్‌ ధోనీ. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అప్పటి వరకు నాకు ధోనీ ఎవరో తెలియదు. కానీ, అప్పటి నుంచి మాత్రం నాకు ధోనీ అంటే చాలా ఇష్టం. ఎంతంటే.. నా భార్య కంటే కూడా నాకు ఎక్కువగా ధోనీనే ఇష్టం’ అని నవ్వుతూ చెప్పేశాడు బషీర్‌. ‘ఇప్పటికీ చాలా మంది నన్ను ప్రశ్నిస్తారు. ఎందుకు ఇండియాకు సపోర్టు చేస్తావని? వారందరికీ నేను ఒకటే సమాధానమిస్తా. అదేంటంటే.. ఇండియాలో మనకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. మా దేశంలో చాలా మంది వృద్ధులు  యువత మనసుల్లో భారత్‌ ఓ శత్రుదేశమనే విష బీజాలు నాటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజంలేదు’ అని తెలిపాడు బషీర్‌.