నా ప్రాణాలకు హాని జరిగితే కేసీఆర్ ప్రభుత్వమే భాద్యత వహించాలి: మంద కృష్ణ

వాస్తవం ప్రతినిధి: కేసీఆర్‌ ప్రభుత్వం తనను భౌతికంగా అంతం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్శీగుట్టలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండుసార్లు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, కానీ బయటకు పొక్కడం వల్లో, సమయం అనువుగా లేని కారణంగానో ఆ కుట్ర అమలు కాలేదని ఆయన అన్నారు. ఒక వేల తన ప్రాణాలకు హాని జరిగితే కేసీఆర్‌ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోని కీలక పెద్దలు, అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తనను హతమార్చే కుట్ర గురించి ఓ మంత్రికి, ఓ ఎమ్మెల్యేకు తెలుసని, దీక్ష చేసినప్పుడు ఆ కుట్రను అమలు చేసేందుకే తనను జైలుకు పంపించారని మంద కృష్ణ ఆరోపించారు. అయితే ఆ మంత్రి, ఎమ్మెల్యే ఎవరనేది త్వరలోనే బయట పెడతానంటూ ఆయన తెలిపారు.