గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న గవర్నర్

వాస్తవం ప్రతినిధి: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గాంధీ ఆసుపత్రి లో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆయన చెవిలో సమస్య ఉండటంతో ఈఎన్టీ వైద్యులు పరీక్షించి, చికిత్స అందించినట్లు తెలుస్తుంది. చికిత్స ముగిసిన అనంతరం గవర్నర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్‌తో కలిసి పలు వార్డులను సందర్శించారు. క్యాజువాలిటీలో అందుతున్న వైద్యసేవలపై స్వయంగా రోగులతో మాట్లాడారు. చాలా బాగా వైద్యం అందుతున్నదని రోగులు సమాధానం ఇవ్వడంతో గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. గవర్నర్ దవాఖానా సూపరింటెండెంట్‌ను అభినందించారు. అలానే వైద్యసేవలు, పారిశుద్ధ్య నిర్వహణ బాగున్నాయని, ఇలాగే కొనసాగించాలని గవర్నర్ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహ్మరావు నేత, ఆర్‌యంవోలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ సాల్మన్, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.