సూకీ మానవ హక్కుల అవార్డును రద్దు చేసిన హలో కాస్ట్ మ్యూజియం

వాస్తవం ప్రతినిధి: మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారని మయన్మార్ ప్రభుత్వ సలహాదారు,నోబుల్ శాంతి పురస్కార విజేత ఆంగ్ సాన్ సూకీ పై పలు ఆరోపణలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మయన్మార్ లోని ఆమె చదువులను అభ్యసించిన విశ్వ విద్యాలయం లో ఆమె విగ్రహాన్ని కూడా తొలగించారు. అయితే ఇప్పుడు తాజాగా సూకీకి అందచేసిన మానవ హక్కుల అవార్డును రద్దు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన హలోకాస్ట్‌ (ఊచకోత) మ్యూజియం ప్రకటించింది. మానవ హక్కుల పరిరక్షణకు ఉద్యమించి విజయం సాధించిన ఆంగ్‌సాన్‌ సూకీకి 2012లో ఎలీవీసెల్‌ మానవ హక్కుల అవార్డును ఈ మ్యూజియం ప్రకటించిన విషయం తెలిసిందే. మ్యూజియం నిర్వాహకులు సూకీకి రాసిన లేఖలో ఆమె మౌనం దేశంలో మైనార్టీలపై సైన్యం దాడులను మరింత ప్రోత్సహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోహింగ్యాల పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఐరాస ప్రతినిధి వర్గాన్ని అడ్డుకోవటం విచారకరమని, దేశంలో సైనిక పెత్తనంపై ఆమె ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని హలోకాస్ట్‌ మ్యూజియం తన లేఖలో పేర్కొంది. రోహింగ్యాలపై కొనసాగుతున్న మారణ కాండను అడ్డుకుని వారికి సంఘీభావం ప్రకటించి వుంటే బాగుండేదని మ్యూజియం తన లేఖలో అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో సూకీ కి అందించిన మానవ హక్కుల అవార్డును రద్దు చేసినట్లు ఆ మ్యూజియం ప్రకటించింది.