షమీ పై మరిన్ని ఆరోపణలు చేసిన భార్య హసీన్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి గురించి అతని భార్య హసీన్ జహాన్ సంచలన విషయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రోజుకో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా షమి భార్య హసీన్‌ జహాన్‌ ‘భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీలా షమి బాలీవుడ్‌ నటిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడు. ఒకసారి నన్ను చంపి అడవిలో పాతిపెట్టమని షమి తన సోదరుడికి చెప్పాడు’ అని వ్యాఖ్యానించింది. షమి తనను గత రెండేళ్ల నుంచి తనకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని, అతడికి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన హసీన్‌ తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘షమికి ఎప్పుడు ఒక కోరిక ఉండేది. భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ ఎలా అయితే బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను పెళ్లాడాడో అలా షమికి బాలీవుడ్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశా అని అంటుండేవాడు. గత రెండేళ్ల నుంచి నన్ను మానసికంగా, శారీరకంగా షమి బాధపెట్టాడు. విడాకులు ఎప్పుడు ఇస్తావు అంటూ ప్రశ్నిస్తూనే ఉండేవాడు’ అని తెలిపింది హసీన్‌.
‘2017లో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పర్యటనకు షమి నన్ను కాకుండా తన పాకిస్థానీ గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఒకసారి షమి.. నన్ను చంపేసి ఏదైనా అడవిలో నా శవాన్ని పాతిపెట్టమని యూపీలో ఉన్న తన సోదరుడికి చెప్పాడు. నాతో కలిసి షమి ఏ ఫంక్షన్‌కు హాజరయ్యేవాడు కాదు. ఒకవేళ ఎక్కడికైనా కలిసి వెళ్లినా తన భార్యగా నన్ను ఎవ్వరికీ పరిచయం చేసేవాడు కాదు. నాతో పెళ్లికి ముందే షమికి ట్యూబా అనే అమ్మాయితో సంబంధం ఉంది. ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు’ అంటూ తన బాధను వెళ్లగక్కింది హసీన్‌.