శృంగార తారతో లైంగిక సంబంధాలను ఖండించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి శృంగార తారతో లైంగిక సంబంధాలున్నట్టు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయమై చాలా రోజులుగా వివిధ రూపాల్లో కథనాలు వెలువడుతుండగా, అమెరికా అధ్యక్ష కార్యాలయం తొలిసారిగా గురువారం స్పందించింది. ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధం ఉండేదని, దానిని బయట పెట్టకుండా ఉండేందుకు ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ 1.30 లక్షల డాలర్లు ఇచ్చి కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని, ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇటీవల పోర్న్ స్టార్ స్టెఫనీ క్లిఫర్డ్ కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వివిధ రూపాల్లో పలు కధనాలు వెలువడినప్పటికీ ఇప్పటి వరకు అధ్యక్ష కార్యాలయం ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇప్పుడు తాజాగా దీనిపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ మాట్లాడుతూ, ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారని, ఈ కేసు ఇప్పటికే మధ్యవర్తి సహాయంతో పరిష్కారమైందని ఆమె గుర్తు చేశారు.