మోదీ వరకూ విస్తరించిన విగ్రహాల విధ్వంసం

వాస్తవం ప్రతినిధి: దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసం నరేంద్ర మోదీ వరకూ విస్తరించింది. గడచిన మూడు రోజులుగా దేశవ్యాప్తంగా లెనిన్ – పెరియార్ – శ్యామ ప్రసాద్ ముఖర్జీ – అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, గత రాత్రి ఉత్తరప్రదేశ్ లోని కౌషంబీ జిల్లా భగవాన్ పూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

ఈ గ్రామంలో 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత బ్రజేంద్ర నారాయణ్ మిశ్రా ఈ విగ్రహాన్ని ఓ శివాలయంలో ఏర్పాటు చేయగా, గ్రామస్థులు పూజలు కూడా చేస్తుండేవారు. ఈ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారని తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి వచ్చి తమ నిరసన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలియజేశారు. మోదీ విగ్రహం ధ్వంసం నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో కేరళలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరాంబా తాలూకా ఆఫీస్ దగ్గర్లోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. విగ్రహంపైకి రాళ్లు విసరడంతో కళ్లద్దాలు – మెడలోని దండ ధ్వంసమయ్యాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు.