పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇంతలోనే ఘోర విషాదం!

 వాస్తవం ప్రతినిధి: పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇంతలోనే ఘోర విషాదం. దైవం సాక్షిగా ఒక్కటైన ఆ కొత్త జంటను.. విధి క్షణాల్లో విడదీసింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాళ్ల పారాణి తడి కూడా ఆరకముందే నవ వధువు భర్తను కోల్పోయి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్కు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో గురువారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఓ దేవాలయంలో వివాహం జరిగింది. అక్కడి నుంచి ఇన్నోవా వాహనంలో వర్ధన్నపేటకు తిరిగి వస్తుండగా కొణిజెర్ల సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో వరుడు రామకృష్ణ ప్రసాద్తో పాటు అతని బంధువులు శరత్, శ్రీదేవి, పద్మ, డ్రైవరు వేణు మృతి చెందారు. వధువు దుర్గతో పాటు చిన్నారులు మహతి, రామన్, కృష్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వధువు సహా గాయపడిన మరో ఇద్దరిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పెళ్లింట విషాధ ఛాయలు అలముకున్నాయి.