త్రిపురలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా ​ విప్ల‌వ్ దేవ్ ప్రమాణ స్వీకారం

వాస్తవం ప్రతినిధి: త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్‌ల‌వ్‌కుమార్ దేవ్, డిప్యూటీ సీఎంగా జిష్ణు దేవ్ బర్మన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తథాగతరాయ్ బిప్ లవ్‌కుమార్‌దేవ్, జిష్ణు దేవ్ బర్మన్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ ఎంపీ మురళి మనోహర్‌జోషి, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవలే జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో త్రిపుర‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీని అధికారానికి చేరువ చేయడంలో విప్లవ్ దేవ్ కీలకపాత్ర పోషించడంతో ఆయనను సీఎం పదవి వరించింది.బీజేపీకి త‌ర‌పున 35 మంది ఎమ్మెల్యేలు గెలుపొంద‌గా, ఇండిజనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎ ఫ్‌టీ) త‌ర‌పున 8 మంది విజ‌యం సాధించారు. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలుండగా 59 స్థానాలకు ఫిబ్రవరి 18న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

గోమ తి జిల్లా రాజ్‌ధర్ నగర్ గ్రామంలో 1971 నవంబరు 25న మధ్యతరగతి కటుం బంలో విప్లవ్ దేవ్ జన్మించారు. ఆయన తండ్రి హరధన్ దేవ్ అప్పట్లో జన్‌సంఘ్ స్థానిక నేతగా వ్యవహరించారు. 1999లో ఉదయ్‌పూర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. దాదాపు పదహారేళ్ల పాటు సంఘ్ ప్రముఖ నేతలతో కలిసి పనిచేశారు. 2015లో త్రిపురకు తిరిగి వచ్చిన దేవ్ బీజేపీ లో చురుగ్గా పనిచేశారు. ఆ మరుసటి ఏడాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పార్టీ ఘన విజ యం సాధించడానికి ప్రధాన కారణం దేవ్ కృషేనని పార్టీ వర్గాల అభిప్రాయం. కాగా, మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం దక్కకుంటే ప్రభుత్వంలో చేరవద్దని ఐపీఎఫ్‌టీ నేతలు నిర్ణయించిన‌ట్లుగా తెలుస్తోంది.