ఢిల్లీలో ‘మహా ధర్నా’ కు సిద్దమవుతున్న గులాబీ దళపతి

 వాస్తవం ప్రతినిధి: మైనారిటీలకు – గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం 50% కోటా పేరుతో ఆమోదం తెలపకుండా తిరిగి రాష్ట్రానికి పంపడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు .ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ దగ్గర ‘మహా ధర్నా’ పేరుతో భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేసే కార్యక్రమానికి వ్యూహం రచిస్తున్నారు గులాబీ దళపతి . పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 6వ తేదీతో ముగుస్తున్నందున ఆ లోపే ‘ఛలో ఢిల్లీ’ – ‘మహా ధర్నా’లను నిర్వహించాలని భావిస్తున్నారు.

రాజ్యాంగంలోని 46వ అధికరణాన్ని సవరించాలని రాష్ట్రాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలని అభిప్రాయపడుతున్నారు. విద్య – ఉపాధి రంగాలు ‘రాష్ట్రాల జాబితా’లో ఉన్నందున వాటిలో రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా కేంద్ర పరిధి నుంచి తప్పించి రాష్ట్రాల జాబితాలో చేర్చాలని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ ఎస్ ఎంపిలు సైతం గత నాలుగు రోజులుగా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడిని మరింత పెంచే విధంగా తగిన కార్యాచరణపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే తేదీ ఖరారుకానున్నట్లు సమాచారం.