టీడీపీ, బీజేపీల మధ్య ట్రిపుల్ తలాక్ అయిపోయింది: జేసీ

వాస్తవం ప్రతినిధి:  టీడీపీ, బీజేపీల మధ్య ట్రిపుల్ తలాక్ అయిపోయిందని, వారి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాలని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాము వదిలేసిన బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖాకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డికి, జేసీ దివాకర్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. తాను వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, తనతో పాటు వచ్చి తన పదవికి విజయసాయి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయసాయికి చిత్తశుద్ధి, రాష్ట్రంపై ప్రేమ ఉంటే వెంటనే రాజీనామాకు కలిసిరావాలని అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన థర్డ్ ఫ్రంట్ వెనుక చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని, చంద్రబాబు వెనుకే అందరూ రావాల్సి వుంటుందని అన్నారు.