కేంద్ర మంత్రుల రాజీనామాలకు రాష్ట్రప‌తి ఆమోదం

వాస్తవం ప్రతినిధి: న‌రేంద్ర మోదీ స‌ల‌హా మేర‌కు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ఇద్దరు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుల రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్ని రోజులు అశోక్ గ‌జ‌ప‌తి రాజు నిర్వ‌హించిన విమాన‌యాన శాఖ బాధ్య‌త‌ల‌ను ప్రధానిమోదీనే నేరుగా ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేక హోదాను బీజేపీ ఇవ్వ‌ని ప‌క్షంలో మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగి వృథా అనే కార‌ణంతో కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి వైదొల‌గాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. మంత్రివ‌ర్గం నుంచి వైదొల‌గిన‌ప్ప‌టికీ ఎన్డీఏలో మాత్రం కొన‌సాగనున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాగా, నిన్న స్వయంగా ప్రధానిని కలిసిన సుజనా, అశోక్ లు తమ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తాము కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించి, రాజీనామా లేఖలను మోదీకి అందించిన సంగతి తెలిసిందే.