ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా క్షిపణి దాడులు…..21 మంది ఆత్మాహుతి సభ్యులు మృతి!

వాస్తవం ప్రతినిధి: అమెరికాకు చెందిన డ్రోన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని ఉగ్రవాద శిక్షణ స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. అమెరికా కు చెందినవి గా అనుమానిస్తున్న డ్రోన్లు అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రావిన్స్‌ అయిన కునార్‌లో బుధవారం ఉగ్రవాద శిక్షణ స్థావరాలపై క్షిపణి దాడికి పాల్పడ్డాయి. అయితే ఈ దాడిలో 21 మంది ఆత్మాహుతి సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. వీరంతా పాకిస్థాన్‌లో ఆత్మాహుతికి దిగడానికి దట్టమైన అటవీ ప్రాంతంలో అన్నివిధాలా సన్నద్ధమవుతున్నవారేనని అధికార వర్గాలు తెలిపాయి. మృతుల్లో ఇద్దరు సీనియర్లతో పాటు ఆత్మాహుతి శిక్షకుడు ఖారీ యాసీన్‌, పాక్‌ తాలిబన్‌ అగ్రనేత ముల్లా ఫజ్లుల్లా తనయుడు కూడా ఉన్నారని సీనియర్‌ అధికారులు వెల్లడించారు. దీనిపై భిన్నరకాలుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్‌ తాలిబన్‌గా పేర్కొందిన ‘తెహ్రీక్‌-ఐ-తాలిబన్‌ పాకిస్థాన్‌’(టీటీపీ), అఫ్గాన్‌ కేంద్రంగా ఉన్న తాలిబన్‌ సంస్థలు వేర్వేరు. పాక్‌ సర్కారుతో పోరాడుతున్న వివిధ ఉగ్రవాద సంస్థలతో కలిసి టీటీపీ పనిచేస్తోంది. ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా దీనిపై అమెరికా ముద్ర వేసింది కూడా.