షకీలా ‘శీలవతి’ టీజర్ రిలీజ్

వాస్తవం సినిమా : దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకొన్న షకీలాప్రధాన పాత్రలో కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘జి’ స్టూడియోస్ సమర్పణలో రాఘవ ఎమ్ గణేష్, వీరు బాసింశెట్టి నిర్మిస్తున్నారు. ‘శీలవతి’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సాయిరామ్ దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. టీజర్‌లో షకీలాను చూస్తుంటే ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండను చూసినట్లుగానే ఉంది. సిగరెట్, మందు, డ్రగ్స్ ఇలా మత్తుపదార్థాలకు బానిస అయిన మహిళ పాత్రలో షకీలా నటించినట్లు అర్థమవుతోంది.
టీజర్ విడుదల సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. నా 250వ చిత్రంలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నా. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది నటించే నాకు కూడా తెలియకుండా స్క్రీన్ ప్లేను రాసుకున్నారు దర్శకుడు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. మరో నటి గీతాంజలి (ఫ్రూటీ) మాట్లాడుతూ.. ‘షకీలాతో ఇది నా రెండో చిత్రం. యంగ్ టీమ్‌తో కలసి పని చేసిన సినిమా కాబట్టి చాలా వేగంగా షూటింగ్ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా’ అని అన్నారు.