శాసనసభలో ఉద్వేగానికి లోనయిన కామినేని

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను అందజేశారు. అనంతరం ఈ ఉదయం కామినేని శాసనసభలో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. అలాగే సీఎం చంద్రబాబుపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నాయకుడు చాలా అవసరమని, ఆయనలా ఎవరూ కష్టపడలేదని కితాబు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని, ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఉన్నత పథంలోకి తీసుకెళ్లడానికి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

తాను అజాత శత్రువునని అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన కాలంలో, అందరితోనూ తాను స్నేహంగానే మెలిగానని చెప్పారు. తన శక్తిమేరకు తన పరిధిలో అన్నీ చేశానని… కొన్ని చేయలేక పోయి ఉండవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. తనకు మంత్రి పదవి రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడే కారణమని చెప్పారు.