వార్నర్ పై ఒక్క మ్యాచ్ నిషేధం!

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఒక్క మ్యాచ్‌ నిషేధం పడనున్నట్లు క్రీడా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సఫారీ గడ్డపై ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో డేవిడ్‌ వార్నర్‌- డికాక్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే, వీడియో ఫుటేజీలో వార్నర్‌దే ఎక్కువ పాత్ర కనిపిస్తుండడం తో వార్నర్ పై ఒక మ్యాచ్ వేటు పడనున్నట్లు తెలుస్తుంది. ఆ వీడియో ఫుటేజీ లో సహచర ఆటగాళ్లు వద్దని వారిస్తున్నా వార్నర్ డికాక్‌పైకి దూసుకెళ్లడంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ విచారణ చేపట్టింది. ఐతే ‘గేమ్‌ ఆఫ్‌ డిస్ప్యూట్‌’ కింద వార్నర్‌ ఐసీసీ లెవల్‌-2 నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఇదే చెబితే అతని ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు చేరతాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు ఉంటే అతడిపై ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం విధిస్తారు. అంతేకాదు మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన వార్నర్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోపక్క వార్నర్‌తో వాగ్వాదంలో ఉన్న డికాక్‌ ఐసీసీ లెవల్‌-1 నిబంధనలు ఉల్లంఘించినట్లు మాత్రమే తెలుస్తోంది. ఇదే జరిగితే అతని ఖాతాలో రెండు డీమెరిట్‌ పాయింట్లతో పాటు మ్యాచ్‌ ఫీజులో కొంత మేర కోత పడుతోంది. మరి ఐసీసీ ఎవరిపై వేటు వేస్తుందో, ఏం చేస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.