చిన్నమ్మ కు వీవీఐ పి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరిన కర్ణాటక సీ ఎం: మాజీ డీజీపీ

వాస్తవం ప్రతినిధి: అన్నాడీఎంకే నేత శశికళ కు జైలు లో వీవీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని కర్ణాటక సి ఎం సిద్దరామయ్య ఆదేశించినట్లు మాజీ డీజీపీ హెచ్ ఎన్ ఆర్ రావు ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగుళూరు లోని పరప్పన అగ్రహర జైలు లో చిన్నమ్మ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జైల్లో ఉన్న శశికళకు మంచం, బెడ్‌, తలగడ తదితర సౌకర్యాలు సమకూర్చాలని సిఎం ఆదేశించారని పేర్కొన్నారు. అయితే మరోపక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాజీ డిజిపి వ్యాఖ్యల్ని ఖండించారు. శశికళకు సౌకర్యాలు సమకూర్చాలని తానెప్పుడూ అధికారులను ఆదేశించలేదని తేల్చి చెప్పారు. ఆమెను పరామర్శించిన ఓ ప్రతినిధి బృందం ఆమెకు కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని ఫిర్యాదు చేసిందని, దీంతో జైలు నిబంధనల ప్రకారం కనీస సౌకర్యాలను మాత్రమే కల్పించాలని తాను ఆదేశించినట్టు సిద్దూ వివరించారు. జైళ్ల శాఖపై వస్తున్న ఆరోపణలపై విచారణకు తాను ఆదేశించినందునే మాజీ డిజిపి తనపై ఈ విధంగా ఆరోపణలు చేశారని సిఎం పేర్కొన్నారు. హోంమంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ వైద్యుల ఆదేశాల మేరకు శశికళకు ఆ సౌకర్యాలు కల్పించినట్టు వెల్లడించారు.