కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడి(కల్వకుంట్ల దోపిడి) పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రెండు పెగ్గులేస్తే ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్‌కి థర్డ్ ఫ్రంట్ అవసరమా? తెలంగాణలో ఆంధ్రోడి పెత్తనం ఏంటని తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడు. ఇప్పుడు కేంద్రం పెత్తనం ఏంటని ప్రధానమంత్రిని చేయాలంటున్నాడు. రేపు ప్రజల మీద దేవుడి పెత్తనమేందని నన్ను దేవుడిని చేయాలంటాడేమో!’
‘కేటిఆర్ ను ఉద్యమ నాయకుడి కొడుకు అని గెలిపిస్తే సిరిసిల్ల ప్రజల నెత్తినెక్కి నాట్యమాడుతున్నాడు. బతుకమ్మ చీరల పేరుతో రూ.150 కోట్ల కమీషన్ కొట్టేసిన చరిత్ర కేటీఆర్‌ది. మైనింగ్ శాఖ హరీశ్ రావు నుంచి గుంజుకుని కేటీఆర్ కు కట్టబెట్టారు. మరి నా కథేందని సంతోష్‌రావు అడిగితే ఆయనకు ఇసుక రీచ్‌లు అప్పగించారు. ఇప్పుడు రాజ్యసభకి పంపిస్తున్నారు’ ‘నేరెళ్ల బాదితులు తగలబెట్టిన లారీలను మేం కొనిస్తాం, లారీల ప్రమాదంలో చనిపోయిన వారిని తిరిగి తీసుకొస్తారా? తెచ్చిన తెలంగాణాలో పేదోడి ప్రాణాలకు విలువ లేదా? పన్ను కట్టలేదని గౌడ సోదరులను ఎక్సైజ్ కార్యాలయంలో నిర్భందిస్తారా? 4200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రైతుని పరామర్శించిన పాపాన పోలేద’ని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.