కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా!

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక ప్రభుత్వం రాష్ర్టానికి ప్రత్యేక జెండాను ఆవిష్కరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ జెండా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. గతేడాదే జెండా రూపకల్పన కోసం 9 మంది సభ్యులతో ఓ కమిటీని నియమించారు. జెండా అయితే ఆవిష్కరించారుగానీ.. దానికి కేంద్రం ఆమోదం తెలుపడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తున్నది. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఇదే బీజేపీ ప్రభుత్వం 2012లో కర్ణాటకలో ప్రత్యేక జెండాను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది జాతి సమగ్రతకు ముప్పని బీజేపీ వాదించింది. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలోని బీజేపీ నేతలు సిద్దరామయ్య ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. అయితే కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎప్పుడూ కూడా ఒకే దేశం,ఒకే జెండా కు కట్టుబడి ఉంటుంది. అలాంటిది కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యెక జెండా పై ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే మరోపక్క సిద్ద రామయ్య మాత్రం కర్ణాటకకు ప్రత్యేక జెండాను సమర్థించుకున్నారు. ఇలా రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? బీజేపీ అలాంటి నిబంధన ఏదైనా చూసిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.