అజ్లాన్ షా హాకీ టోర్నీ లో బోణీ కొట్టిన భారత్…..మలేసియా పై విజయం!

వాస్తవం ప్రతినిధి: అజ్లాన్‌ షా హాకీ టోర్నీలో భారత్‌ ఎట్టకేలకు బోణీ చేసింది. అర్జెంటీనా చేతిలో ఓడి.. తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సర్దార్‌ సేన బుధవారం చెలరేగిపోయింది. దీనితో ఆతిథ్య మలేసియాను 5-1తో మట్టికరిపించి, ఫైనల్‌కు అర్హత సాధించేందుకు ఓ చిన్న అవకాశాన్ని సృష్టించుకుంది. భారత్‌ తరఫున గుర్జాంత్‌ సింగ్‌ (42వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ కొట్టగా.. శిలానంద్‌ లక్రా (10వ), సుమిత్‌ కుమార్‌ (48వ), రమణ్‌దీప్‌ సింగ్‌ (51వ) తలో గోల్‌ సాధించారు. ఈ విజయంతో భారత్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. చివరి రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌ ఫైనల్‌ చేరుతుందో లేదో తేల్చనున్నాయి. భారత్‌ ఫైనల్‌ చేరాలంటే శుక్రవారం భారీ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించాలి. అర్జెంటీనాపై ఆస్ట్రేలియా నెగ్గాలి. అదే సమయంలో మలేసియా, ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగియాలి.ఇవన్నీ జరిగితే భారత్ ఫైనల్ కు చేరుకున్నట్లే అన్నమాట.