‘మనస్సాక్షిగా ఓటేయండి’ : జగన్

చంద్రబాబు పాలనలో అభివృద్ధి ఎక్కడుంది?
ఇంకొల్లు బహిరంగ సభలో వైఎస్ జగన్
వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలు సంతోషంగా లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన.. ఇంకొల్లు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.జగన్ మాట్లాడుతూ..‘నిన్నటి కంటే నేడు బాగుంటే అది అభివృద్ధి. కానీ, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అది మచ్చుకు కూడా కనిపించటం లేదు. మహిళలు, చిన్న పిల్లలను కూడా వదలకుండా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా ఆయన నెరవేర్చలేదు. పిల్లలు తాగి చెడిపోతున్నారని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మద్యం షాపులను ప్రొత్సహిస్తున్నాడు. అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లులు తగ్గిస్తానన్నాడు. అవేమో ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి. రేషన్ సరుకుల్లో కోత పడింది. రైతుల కోసం ప్రవేశపెట్టిన రుణ మాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ మహిళా కన్నీరు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. చివరకు నిరుద్యోగుల భృతి విషయంలో మాట తప్పాడు. ఇలా అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అసలు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు’ అని వైఎస్ జగన్ నిలదీశారు. చెడిపోయిన రాజకీయాల్లోకి విశ్వసనీయత వస్తేనే బాగుపడుతుందని, నేతలు ఎవరైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతితో అడ్డగోలు డబ్బు సంపాదించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. వారిని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు తేవాలన్న తన ప్రయత్నానికి ప్రజల నుంచి మద్ధతు కావాలని జగన్ కోరారు. ‘ఇప్పుడు చంద్రబాబును క్షమిస్తే రేపు పెద్ద మోసాలకు తెరలేపుతాడు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో కలిపేయండి. మనస్సాక్షిగా ఓటేయండి’ అంటూ ప్రజలను జగన్ కోరారు.