భారత యువ కుబేరునిగా పేటీఎం వ్యవస్థాపకుడు!

వాస్తవం ప్రతినిధి: భారత యువ కుబేరునిగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌‌ శర్మ అవతరించారు. ఫోర్బ్స్ తాజా జాబితా లో యువ కుబేరుడిగా శేఖర్ శర్మ అవతరించగా, ఇక భారత్‌లో అత్యంత వృద్ధ కుబేరునిగా ఎమెరిటస్‌ అల్కేమ్‌ లాబొరేటరీస్‌ ఛైర్మన్‌ అయిన 92 ఏళ్ల సంప్రదాసింగ్‌ ఉన్నారు. 1.7 బిలియన్‌ డాలర్లతో పేటీఎం అధినేత 1,394వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక భారత్‌ నుంచి 40 ఏళ్లలోపు వయసున్న బిలియనీర్‌ ఆయన ఒక్కరే కావడం విశేషం. 2011లో పేటీఎంను స్థాపించిన శర్మ,అనంతరం వ్యాపారాన్ని విస్తరించి.. పేటీఎం మాల్‌, ఈకామర్స్‌ బిజినెస్‌, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లను సృష్టించారు. భారత్‌లో పెద్దనోట్ల రద్దు అనంతరం పేటీఎం ఎక్కువగా లాభపడిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు సమయంలో 250 మిలియన్‌ రిజిస్టర్‌ యూజర్లతో రోజుకు 7 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. శర్మకు పేటీఎంలో 16 శాతం వాటా ఉంది. ఇప్పుడు పేటీఎం విలువ 9.4 బిలియన్‌ డాలర్లకు చేరింది అని ఫోర్బ్స్‌ వెల్లడించింది.