త్రిపుర సిఎం గా విప్లవ్ కుమార్ దేవ్ ఏకగ్రీవ ఎన్నిక!

వాస్తవం ప్రతినిధి: త్రిపుర భాజపా శాసనసభాపక్ష నేతగా విప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ పరిశీలకునిగా వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ సమక్షంలో మంగళవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో దేవ్‌ నాయకత్వానికి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం తో త్రిపుర సి ఎం గా విప్లవ కుమార్ ఎన్నిక ఖరారు అయ్యింది. నూతన సీఎంగా గిరిజన శాసనసభ్యుడికి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన భాజపా భాగస్వామ్య పక్షం- ‘ఇండీజీనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర’ (ఐపీఎఫ్‌టీ) మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తుంది. ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో 35 భాజపాకి లభించగా, ఐపీఎఫ్‌టీ 8 చోట్ల గెలిచింది. ఇంతవరకు భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షునిగా ఉన్న విప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఈ నెల 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభాపక్ష ఉప నేతగా ఎన్నికైన జిష్ణుదేవ్‌వర్మ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని గడ్కరీ విలేకరులకు తెలిపారు.