ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రవీణ్ తొగాడియా

వాస్తవం ప్రతినిధి: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తుంది. సూరత్‌కు స‌మీపంలో ఆయ‌న‌ ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన తనను హతమార్చేందుకు కుట్ర పన్నారని తొగాడియా ఆరోపించారు. జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ పోలీసులు కనీసం ఎస్కార్ట్ టీమ్‌ను కూడా కేటాయించలేదని తొగాడియా అన్నారు. ఈ రోజు తాను పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను పోలీసులకు తెలియజేసినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత నిర్లక్ష్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో అందులో ఉన్న వారు సురక్షితంగానే బయటపడ్డారు. ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. తొగాడియాకు ప్రాణహాని ఉందని వీహెచ్‌పీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.