కేపీజేపీకి ఉపేంద్ర గుడ్‌ బై..మరో కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటన!

వాస్తవం ప్రతినిధి: రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన ఉపేంద్ర గతేడాది సొంత పార్టీ ‘కర్ణాటక ప్రజ్ఞాయవంత జనతా పార్టీ’(కేపీజేపీ) ని ప్రకటించారు. అయితే, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఆయన ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు నేతలు ఆయనపై తిరుగుబాటు ప్రారంభించారు. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ .. ఉపేంద్ర పెద్ద సినీ నటుడైతే కావొచ్చేమో కానీ పార్టీలో మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తామేం చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదని, ఉపేంద్రపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. మరోవైపు ఉపేంద్ర బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పందించిన ఉపేంద్ర.. తాను మరో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తాను బీజేపీలో చేరనని, మరోపార్టీ స్థాపించి ప్రజల ముందుకు వస్తానని ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.