అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డ్!

వాస్తవం ప్రతినిధి: ముక్కోణపు టోర్నీలో భారత్‌ పరాజయంతో ఖాతా తెరిచింది. నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా మంగళవారం ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించడంతో జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌటైన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం. నిన్న జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో చమీరా వేసిన నాలుగో బంతిని ఆడిన రోహిత్‌.. జీవన్‌ మెండీస్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్ర్కమించాడు. ఖాతా తెరవకుండానే రోహిత్‌ ఔటయ్యాడు. ఇప్పటి వరకు 75 టీ20లు ఆడిన రోహిత్‌ 68 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డకౌటయ్యాడు. భారత్‌ తరఫున ఏ ఆటగాడు ఇన్నిసార్లు డకౌటైన దాఖలాలు లేవు. ఆశిష్‌నెహ్రా(3), యూసుఫ్‌ పఠాన్‌(3), గౌతం గంభీర్‌(2), రవీంద్ర జడేజా(2) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.